మేం వికలాంగులం: బీసీసీఐ అధ్యక్షుడు
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై చర్చించడానికి అత్యవసరంగా చెన్నైలో సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీ అంచనా వేసినట్లు ఎటువంటి నిర్ణయాలూ తీసుకోలేదు. క్రికెటర్లపై జీవితకాల నిషేధం విధించవచ్చంటూ వార్తలు వచ్చినా అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన ముగ్గురు క్రికెటర్లు శ్రీశాంత్, చండీలా, చవాన్ పై రాజస్థాన్ రాయల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుందని సమావేశం అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ చెప్పారు. తాము సొంతంగా దర్యాప్తు చేసేందుకు వీలుగా ఈ కేసులో ఢిల్లీ పోలీసుల వద్దనున్న సాక్ష్యాధారాలను తమకివ్వాలని కోరామని చెప్పారు. దర్యాప్తులో క్రికెటర్ల పాత్ర బయటపడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాము వికలాంగులమని, బుకీలను నియంత్రించడానికి తమకు ఎటువంటి అధికారాలు లేవని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు.